ఢిల్లీలో అత్యంత వృద్ధ ఓటరు 111 ఏళ్ల కలితార మండల్ శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన వేలుకు ఇంక్ ముద్ర వేయించుకోవడానికి ఆమె ఇప్పటికీ ఆసక్తి కనబరుస్తారు. గత శతాబ్ధ కాలంగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేశారు. 1908 లో అవిభజిత ఇండియాలోని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రాంతంలో జన్మించిన కలితార మండల్ ఉప ఖండంలో జరిగిన ఎన్నో మార్పులకు సజీవ సాక్షిగా ఉన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల విభజనానంతరం కుటుంబంతో సహా దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఆమె రెండు సార్లు ఇండియాలో శరణార్దిగా ఉన్నారు.” అవును, నాకు గుర్తింది… వాళ్లు (పోలీస్ సిబ్బంది)నా వేలి ముద్రను తీసుకొని బ్యాలెట్ పేపర్ ఇచ్చేవారు…ఓటేసిన తర్వాత దాన్ని డబ్బాలో వేసే వాళ్లం. పెద్ద పెద్ద మిషన్లలో కూడా ఓటేశాను” అని చెప్పారు. ఢిల్లీలోని సి.ఆర్. పార్క్ లో నివసించే నాలుగు తరాల మండల్ కుటుంబంలో కలితార అందరి కంటే పెద్దది.
1971 యుద్ధానికి ముందు కొన్నేళ్ల క్రితమే మత కలహాల కారణంగా ఈస్ట్ పాకిస్థాన్ నుంచి భర్త, పిల్లలతో కలిసి ఇండియాకు వలస వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో శరణార్ధిగా గడిపింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ఆమె కుటుంబం తిరిగి పాకిస్థాన్ వెళ్లింది. 1971 యుద్ధం మొదలవ్వడంతో మళ్లీ ఇండియాకు వచ్చి మధ్యప్రదేశ్ లో శరణార్ధిగా గడిపింది. అందుకే మా కుటుంబం రెండు సార్లు శరణార్ధులుగా గడపాల్సి వచ్చిందంటారు కలితార మండల్ చిన్న కుమారుడు సుఖ్ రంజన్ మండల్. 1980 ప్రాంతంలో మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చిన కలితార మండల్ కుటుంబం ఢిల్లీలోని సి.ఆర్.పార్క్ ప్రాంతంలో స్థిరపడ్డారు. నోట్లో పళ్లన్ని ఊడిపోయినప్పటికీ ఇప్పటికీ చేపలంటే అమిత ఇష్టం. చేపలు, పాన్ మాత్రం తప్పకుండా తింటుంది.