దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజువారీ కేసులు సంఖ్య తగ్గుతుందనే ఊరట లేకుండా మరణాల సంఖ్య ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేసులు గరిష్టంగా నమోదైనపుడు కంటే ఇప్పుడు రెట్టింపు మరణాలు వెలుగు చూడటం అంతుపట్టడం లేదు. తాజాగా ఈ రోజు 1192 మంది కరోనాతో మృతి చెందారు. మృతులు సంఖ్య పెరిగినా కేసులు మాత్రం గణనీయంగా తగ్గాయి.
గడిచిన 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. ఓ వైపు కేసులు తగ్గుముఖంపట్టడంతో పాటు.. రికవరీ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా 2,54,076 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,14,69,499కి చేరింది. అందులో ఇప్పటివరకు 3,92,30,198 మంది కోలుకోగా.. 4,96,242 మంది వైరస్ తో మృతి చెందారు. ప్రస్తుతం 17,43,059 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసులు తగ్గుతున్నా నిబంధనలు పాటించాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆంక్షలు సడలిస్తున్నా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అమలవుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ శరవేగంగా కొనసాగిస్తున్నాయి. సోమవారం 61,45,767 డోసులు అందించారు. ఇప్పటివరకు 1,66,68,48,204 వ్యాక్సిన్ల పంపిణీ చేశారు.