అంతరించిపోతున్న చీతాలను పునరుద్దరించే కార్యక్రమంలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు భారత్‌కు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు చీతాలు గ్వాలయర్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయి. వాటిలో ఏడు మగ, ఐదు ఆడ చీతాలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఆఫ్రికాలోని నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కుకు వచ్చాయి.
దీంతో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరనుంది. ఈ 12 చిరుతలకు మొదట మత్తు మందు ఇచ్చి డబ్బాల్లోకి ఎక్కించారు. అక్కడ నుంచి టాంబో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి భారత వాయుసేనకు చెందిన సీ-17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానం ద్వారా ఈ చీతాలను భారత్ కు తీసుకు వచ్చారు.
ఉదయం 11 గంటలకు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి యాదవ్ చిరుతలను క్యారంటైన్‌లోకి పంపనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చీతాలను నెల రోజుల పాటు క్వారంటైన్‌లో (ఎన్‌క్లోజర్)లో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు.
అనంతరం వాటిని పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి పంపిస్తామని వెల్లడించారు. అంతరించి పోతున్న చీతాల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్కులో వదిలారు.