ఉక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. పలు నగరాలపై రష్యా క్షిపణి దాడులు చేసింది. నిప్రో నగరంలో ఓ నివాస సముదాయంపై చేసిన రష్యా దాడుల్లో 12 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలైనట్టు అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు.
పశ్చిమాన ఎల్‌వీవ్, దక్షిణాన మైకోలివ్, ఈశాన్యంలో ఖార్కీవ్, ఆగ్నేయ దిశలో జపోరిజజియా, నిప్రో ఇలా ఏ దిక్కులో చూసిన క్షిపణి దాడులు, బాంబు పేలుళ్లు మాత్రమే కనిపిస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిప్రోలోని తొమ్మిదంతస్తుల భవనంపై రష్యా దాడులు చేసినట్టు పేర్కొన్నారు.
దాడుల్లో 12 మంది మరణించారు. దీంతో పాటు 27 మంది ప్రజలు, ఆరుగురు చిన్నారులు గాయాలపాలైనట్టు చెప్పారు. రష్యా ఎయిర్ స్ట్రైక్స్‌లో తొమ్మిది అంతస్తుల భవనం కూలిపోయినట్టు అధ్యక్షుడు జెలెన్ స్కీ వివరించారు. శిథిలాల కింద నుంచి 20 మందితో పాటు మూడేండ్ల చిన్నారిని కాపాడామన్నారు.
ఉదయం 6 గంటల ప్రాంతంలో రాజధాని కీవ్ పై రష్యా దాడులు చేసింది. కీవ్‌లోని క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడులు చేసినట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడిందన్నారు.