తెలంగాణ రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలకు వాగులు, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. భారీ వరద నీటితో చెరువులు, కాలువలు నిండుకుండలను తలపిస్తున్నాయి. అందులోనూ ప్రస్తుతం పిల్లలకు దసరా సెలవులు. ఇంకేముంది గ్రామాల్లోని పిల్లలు, యువకులు సరదాగా ఈతకు వెళ్లి, తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 10 రోజుల వ్యవధిలోనే ఏకంగా 12 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈత అంటే యువకులతో పాటు పిల్లలకు కూడా సరదానే. అదే వారి పాలిట శాపంగా మారుతోంది. పదుల సంఖ్యల్లో పిల్లలు మృతి చెందుతూ.. తీరని కడుపు కోతను మిగుల్చుతున్నారు.
తాజాగా హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో చోటుచేసుకున్న మరో ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శంషాబాద్ మండలం జూకల్ గ్రామానికి చెందిన నదీమ్ అనే 19 ఏళ్ల యువకుడు, 29ఏళ్ల మహేందర్ సోమవారం ఉదయం నానాజీపూర్ వాగులో ఈత కోసం వెళ్లారు. వాగులోకి దిగిన యువకులు, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలోనే మునిగి, ఊపిరాడక మరణించారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. సోమవారం గాలింపు చర్య చేపట్టగా.. మంగళవారం ఇద్దరి మృత దేహాలను వెలికి తీశారు.
కాగా సెప్టెంబర్ 26న షాద్ నగర్ మున్సిపాలిటీలోని సోలీపూర్ గ్రామ శివారులో వెంచర్‌లో తవ్విన భారీ గుంతల్లో పడి ముగ్గురు చిన్నారులు మరణించారు. ఇది మరువక ముందే సెప్టెంబర్ 28న కీసర మండలం నాట్కాన్ చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు డిప్లోమా విద్యార్థులు మృతి చెందారు. మరో రోజు వ్యవధిలోనే ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గొల్లగూడ గ్రామ సమీపంలోని ఎర్రకుంటలో ఈత
కొట్టేందుకు దిగి నలుగురు చిన్నారులు కన్నుమూశారు.
ఇలా వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనల్లో 10 మంది విద్యార్థులు, చిన్నారులు మరణించారు. ఇవే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి రాని ఘటనలు మరెన్నో ఉంటున్నాయి. నీటి లోతు తెలియక అంచనా వేయలేక లోపలికి దిగుతూ ప్రాణాలను కోల్పోతున్నారు. మరో వైపు క్వారీలు, నిర్మాణ అవసరాల కోసం తవ్విన గుంతల్లో నీరు నిలిచి పోవడంతో మరికొంత మంది మరణిస్తున్నారు. ఇది నిర్లక్ష్యం కారణమో.. ఏం జరగదనో భరోసానో కానీ చివరికి కడుపు కోత మిగుల్చుతున్నారు.