కరెంట్ షాక్ తో పులి మరణించిన ఘటన.. ప్రకాశం జిల్లా అక్కపాలెం అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం బయట పడకుండానే కొందరు గుట్టుచప్పుడు కాకుండా పులిని వండుకుని తిన్నారు. అయితే ఈ నెల 10న ఎర్రగొండపాలెంలో ఆడపులి పాదముద్రలను అటవీ సిబ్బంది గుర్తించారు.
దీంతో పులి ఆచూకీని తెలుసుకునేందుకు అదే రోజు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పులి సంచారం గురించి సమీప ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ ఆరుబయట ఎవరూ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
అయితే పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన కంచె తగిలి పులి మరణించింది. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పులి మాంసాన్ని వండుకుని తినేసినట్టు తెలుస్తోంది. పులి గోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య విబేధాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది పులి మాంసం తిన్నట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం నిందితుల్లో ఇద్దరిని ఎర్రగొండపాలెం ఆఫీసుకు పిలిచి రహస్యంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.