దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు మరో 12 ఛీతాలు రానున్నాయి. ఈ నెల 18 న ఇవి మధ్యప్రదేశ్ కి చేరుకోనున్నాయని, వీటిని కూడా ఇక్కడి కునో జాతీయ పార్క్ కు తరలించనున్నారని ‘ఛీతా రివైవల్ ప్రాజెక్ట్’ నిపుణుడొకరు తెలిపారు. ఇప్పటికే గత ఏడాది నమీబియా నుంచి 8 ఛీతాలను ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రానికి చేర్చారు. వీటిలో ఒకటి అస్వస్థతకు గురి కాగా చికిత్స అనంతరం కోలుకుందని.. మిగిలినవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ఆ నిపుణుడు తెలిపారు.
ఇక 12 ఛీతాల కోసం ప్రత్యేక వసతులున్న విమానాన్ని సౌతాఫ్రికాకు పంపినట్టు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. వీటిలో ఏడు మగ, అయిదు ఆడ ఛీతాలు ఉంటాయని ఆయన చెప్పారు. వీటిని రప్పించేందుకు గురువారం ఘజియాబాద్ లోని హిండన్ వైమానిక స్థావరం నుంచి ఓ విమానం బయల్దేరి వెళ్ళింది.
ఈ నెల 18 న 12 ఛీతాలతో ఈ విమానం గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరనుంది. అంతరించిపోతున్న ఈ జంతువుల జాతిని పరిరక్షించేందుకుకేంద్రం ‘ఛీతా రివైవల్ ప్రాజెక్టు’ను చేబట్టింది. అందులో భాగంగా వీటిని సౌతాఫ్రికా నుంచి రప్పించేందుకు ఉభయ దేశాల మధ్య గత ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదిరింది.
అయితే దీని అమలులో జాప్యం జరిగింది. ఇకపై రానున్న 8-10 ఏళ్లలో ఏటా సుమారు 12 ఛీతాలను ఇండియాకు తెప్పించాలన్న ప్రతిపాదన ఉంది. ప్రపంచంలోని సుమారు 7 వేల ఛీతాల్లో ఎక్కువగా నమీబియా, బోట్స్వానా లో ఉన్నాయి.