క్రికెట్ బెట్టింగ్ నడిపించి పైసలు సంపాదించినోళ్లు అసెంబ్లీలో జూనియర్ ఎన్టీఆర్ ని మించి మరీ డైలాగులు చెబుతూ తొడలు గొడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా భూములు కొట్టేసి.. ప్రజాధనాన్ని తమ ధనంగా మార్చుకున్న పెద్దమనిషి ముఖ్యమంత్రిగా మారి.. హాయిగా నవ్వుకుంటూ ప్రతిపక్ష నేతకు టార్చర్ చూపిస్తున్నాడు. ప్రతిపక్ష నేత వారిని సరిగా ఎదుర్కోలేక.. తికమకపడుతూ.. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే చూస్తూ నీళ్లు నములుతున్నాడు. ఇక అవకాశం, అభిమానం ఉన్న హీరో అయితే.. ఎవరో చెబితేనే తాను నడుస్తున్నట్లు నటిస్తున్నాడు. జనం పెట్టుకున్న నమ్మకం ఒకటైతే ఆయన చేసేది మరోటి. ఇక కేంద్రంలో అధికారం ఉండి.. ఇక్కడ అధికారంలోకి రావాలనుకునే నేతలేమో డబల్ గేమ్ ఆడుతూ ఉంటారు. మరెవరు వచ్చి.. ఈ ముఖ్యమంత్రిని సరిగా ఢీకొంటారో.. ఎప్పటికి ఈ రాష్ట్రం మంచి రోజులు చూస్తుందోననే కామెంట్లు సోషల్ మీడియాతో తిరుగుతున్నాయి.
అదేమంటే.. ఆంధ్రప్రదేశ్ కి ఏమైందిప్పుడు.. చక్కగా ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఎప్పుడూ ఏదో ఒక అమౌంట్ జగనన్న వేస్తూనే ఉన్నారుగా, గ్రామ సచివాలయాలు బాగానే పని చేస్తున్నాయిగా.. అందరికీ ఏ సర్టిఫికెట్ అయినా వెంటనే వచ్చేస్తుంది.. ఇంకేం కావాలని అడుగుతున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే విషయం ప్రస్తావించారు. ఇప్పుడేదో వస్తున్నాయని కాదు.. రేపు ఎలా అనేది తెలియాలన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకుండా.. ఖర్చులే పెట్టుకుంటూ పోతే భవిష్యత్ పరిస్ధితి ఏంటి.. వ్యాపారాలు జరగకుండా.. నిర్మాణాలు జరగకుండా ఉంటే.. అవన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతే.. రేపు జనం అకౌంట్లలో పప్పు బెల్లాల్లాగా వేయడానికి డబ్బులు కూడా ఉండవని ఆయన హెచ్చరించారు.
ఇదే విషయం అందరూ ఆలోచించాలని మేధావులు కోరుతున్నారు. వ్యవస్ధల మధ్య అంతర్యుద్ధాలు.. పాలనలో పోలీసులు, అధికారులు అంతా జీహుజూర్ అంటూ రూల్స్ పక్కన పెట్టి.. జగన్ రాజ్యాంగాన్నే అమలు చేస్తుంటే.. ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో కనపడుతున్నారు. ఇసుక పాలసీ మారుస్తున్నట్లు నటించి.. మొత్తం ఇసుకను గుప్పిట్లో పెట్టుకుని తెలుగుదేశాన్ని మించి దోచుకుంటుంటే.. ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నడుస్తున్నదానిని ఆపి మరీ రివర్స్ టెండరింగ్ అంటూ తమ కాంట్రాక్టర్ కు వర్క్ ఇచ్చుకుంటే ఏమీ చేయలేని పరిస్ధితి.
Advertisements
రాజధాని అంటే కేవలం పాలనాపరమైనదనే దానికి అర్ధాలు మార్చేసి చంద్రబాబు భూతలస్వర్గం అంటూ ఓవరాక్షన్ చేసి.. 33 వేల ఎకరాలు తీసుకుని రాజధాని అని మొదలెడితే… అసలు ఏమీ లేకుండా చేసేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు పాలనాపరమైన రాజధాని కూడా అవసరం లేదు.. అంతా వైజాగ్ లో పెట్టిస్తూ.. అక్కడ వ్యాపారం చేసుకుంటున్నా.. ఎవరూ ఏమీ చేయలేని పరిస్ధితి. ఆఖరికి కోర్టులు ఆపుతున్నా ఆగని బరితెగింపు కనపడుతున్నా ఎవరూ అడగలేని పరిస్ధితి. పేదలకు ఇళ్ల స్ధలాలంటారు.. పనికిరాని భూములకు ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బులు పెట్టించి దోచుకుని.. మళ్లీ ఆ స్ధలాలను పంచుతున్నట్లు ఫోజులు పెట్టడం.. అన్నిటికీ మించి మద్యనిషేధం అని చెప్పి.. సొంత దుకాణాలు ఓపెన్ చేసి.. సొంత సరుకు అమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్నా.. ఎవడూ ఏమీ చేయలేకపోతున్నాడు. ఎవరు అడగాలన్నా.. ఎవరు నిలదీయాలన్నా.. వారి వారి తప్పులు వారికి బ్రేకులు వేస్తున్నాయి. నిజాయితీగా ఉండి.. జనం కోసం పని చేసి.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నవారిని అడిగే మొనగాళ్లు ఎక్కడా కనపడటం లేదు.. ఎప్పుడొస్తారో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.