యూపీలో ఓ వివాహ కార్యక్రమంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఖుషీ నగర్ జిల్లాలో నౌరంజియాలో బావిలో పడి 13 మంది మహిళలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఘటన వివరాల్లోకి వెళితే.. పరమేశ్వర్ కేష్వాహా అనే వ్యక్తి వివాహా వేడుకలను నౌరంజియాలో నిర్వహించారు. అందులో భాగంగా హల్దీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బందువులు తరలివచ్చారు.
వారిలో 60 మంది మహిళలు, బాలికలు ఓ బావి స్లాబ్ పై కూర్చున్నారు. వారి బరువుకు తట్టుకోలేక బావిపై ఉన్న స్లాబ్ కూలిపోయింది. దీంతో వారంతా బావిలో పడిపోయారు. వెంటనే చుట్టు పక్కల వారు వచ్చి బావిలో పడిన వారిని బయటకు తీశారు.
అప్పటికే వారిలో 11 మంది మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా మరో ఇద్దరు మరణించారు. అనుకోని ఘటనలో వివాహ వేడుకలు విషాదంగా మారాయి.
ఘటన విషయం తెలుసుకుని ముఖ్య మంత్రి యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం తరఫున ప్రకటించారు. దీనిపై ప్రధాని మోడీ సైతం దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలయజేస్తూ.. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.