హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. విద్యార్థులు, యువకులు, ఐటీ ఉద్యోగులు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో డ్రగ్స్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై సిటీ పోలీసులు దృష్టి సారించారు. దీంతో డ్రగ్స్ పెడ్లర్ల వద్ద లభిస్తున్న ఫోన్ నంబర్లలో సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పేర్లు కూడా బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ తీసుకుంటున్న ఉద్యోగులపై ఐటీ కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
ఇప్పటికే పోలీసులు డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను ఆయా కంపెనీలకు అందించారు. పోలీసులు ఇచ్చిన ఆధారాలతో ఐటీ కంపెనీలు ఆ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు వారం వ్యవధిలో 13 మంది ఉద్యోగులను తొలగించాయి. మరో 50 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు.
పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల వద్ద టెక్కీల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఐటీ ఉద్యోగుల చిట్టా బయటపడుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పెద్ద ఎత్తున డ్రగ్స్ అమ్మినట్టు పోలీసులు తేల్చారు.
ఈ క్రమంలో డ్రగ్స్ వాడిన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మహీంద్రా క్యూసాఫ్ట్ ఉద్యోగులను పోలీసులు పట్టుకున్నారు. టోనీ, ప్రేమ్ కుమార్, లక్ష్మీపతి వద్ద నుంచి వీరు డ్రగ్స్, గంజాయి కొన్నట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, వీకెండ్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్లు వెళ్లే పార్టీలపై పోలీసులు నిఘా పెట్టారు.