తమిళనాడులో బీజేపీకి షాక్ తగిలింది. ఈ పార్టీకి చెందిన 13 మంది దీని మిత్ర పక్షమైన అన్నాడీఎంకేలో చేరారు. మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వం లోని ఏఐడీఎంకే తమ పార్టీకి ఎర వేస్తోందని ఓ వైపు బీజేపీ ఆరోపిస్తుండగానే బుధవారం ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. నిజానికి రెండు రోజుల క్రితమే కమలం పార్టీ నుంచి ఈ పార్టీకి వలసలు ప్రారంభమయ్యాయి. బీజేపీ ఐటీ విభాగం చీఫ్ సీటీ. నిర్మల్ కుమార్ అన్నా డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.
ఇటీవలి ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నిక తరువాత రాష్ట్ర బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయి. పశ్చిమ చెన్నైలోని ఐటీ విభాగానికి చెందిన పలువురు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా బీజేపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు అంబరాజన్ .. కొన్ని రోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తమను పార్టీని వీడేలా చేశాయన్నారు. ఆయనతో బాటు బీజేపీని వీడినవారిలో 10 మంది ఐటీ వింగ్ జిల్లా కార్యదర్శులు, ఇద్దరు ఐటీ వింగ్ డిప్యూటీ కార్యదర్శులు ఉన్నారు.
అంతకు ముందే బీజేపీ మేధో విభాగం రాష్ట్ర కార్యదర్శి కృష్ణన్, ఇంకా దిలీప్ కన్నన్, తిరుచ్చి రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ తదితరులు పార్టీని వీడారు. అయితే దీనిపై స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. తమ పార్టీని వీడుతున్నవారిని అడ్డుకోబోమని, వారు ఏ పార్టీలోనైనా చేరవచ్చునని అన్నారు. వారికి ఆ స్వేచ్ఛ ఉందన్నారు. కొన్ని పార్టీలు తమ పార్టీలో మూడో శ్రేణిలో ఉన్నవారిని ఆకర్షించడానికి నానాతంటాలు పడుతుంటాయన్నారు.