తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూపు గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గురువారం బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయని వివరించారు.
ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1300 మందికి ప్రత్యక్షంగా, 1150 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సీఎం చెప్పారు. ఇలాంటి కంపెనీలు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. మరీ ముఖ్యంగా 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా తన పాలనలో చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి కంపెనీ ముందుకు రావడం శుభపరిణామం అని ఆయన అభిప్రాయపడ్డారు.
గ్రాసిమ్ పరిశ్రమ ఏర్పాటుపై బలభద్రపురం గ్రామస్తులు గతంలో ఆందోళన చెందారని గుర్తుచేశారు. అయితే, ఈ పరిశ్రమలో టెక్నాలజీలో మార్పు ద్వారా జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్జ్ అవుతుందని జగన్ తెలిపారు. భయాలకు తావులేకుండా ప్రాజెక్టును నెలకొల్పారన్నారు. కలుషిత వ్యర్థాలు నేరుగా వదలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్ సంస్థకు ప్రాజెక్ట్ అప్పగించిందని తెలిపారు. అయితే, గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేసినట్లు చెప్పారు. అవరోధాలను ఒక్కొక్కటిగా తొలగించి ప్రాజెక్టును నెలకొల్పామని సీఎం జగన్ అన్నారు.
కాగా, గతంలో గ్రాసిమ్ ప్రాజెక్టు సంబంధించి జరిగిన ఆందోళనల్లో 131 మందిపై కేసులు నమోదయ్యాయని.. ఆందోళనకారులపై ఆ కేసులను ఎత్తివేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ రోజే జీవో విడుదల చేస్తున్నామని తెలిపారు.