మహారాష్ట్రలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. నిన్నటిదాకా దేశవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాలు.. ఇప్పుడు ఒక్క ఆ రాష్ట్రంలోనే బయటపడటం కలకలం రేపుతోండి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 132 మంది కరోనా కాటుకు బలయ్యారు. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 53 వేల 589కి పెరిగింది.ఇక తాజా కేసుల విషయానికి వస్తే మహారాష్ట్రలో కొత్తగా 28,699 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితులు 25.33 లక్షలకు పెరిగారు. ప్రస్తుతం ఆ ఒక్క రాష్ట్రంలోనే 2.30 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 5,722 కేసులు ఒక్క పుణె జిల్లాలోనే నమోదయ్యాయి. అలాగే 38 మంది ఈ జిల్లాలోనే చనిపోయారు. అటు ముంబైలో కొత్తగా 3512 మందికి కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. తాజాగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ. ప్రస్తుతం మహారాష్ట్ర పరిస్థితే అధ్వాన్నంగా ఉంది. గతంలో కంటే వేగంగా అక్కడ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.