తీన్మార్ మల్లన్నకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది హయత్ నగర్ కోర్టు. బుధవారం హయత్ నగర్ మునగనూరులోని మేజిస్ట్రేట్ ముందు మల్లన్నతో పాటు మరో నలుగురిని మేడిపల్లి పోలీసులు కోర్టులో హాజరు పర్చగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మల్లన్నతో పాటు నలుగురు వ్యక్తులను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.
అంతకుముందు కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని రిలీజ్ చేశారు పోలీసులు. తీన్మార్ మల్లన్నపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 148, 307, 342,506, 384, 109,r/w 149 ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదైనట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు. రావనకల్ సాయి కరణ్ గౌడ్ ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై ఈ కేసులు ఫైల్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఫిర్యాదులో సాయి కరణ్ గౌడ్.. ‘తాను 19.03.2023 (ఆదివారం) మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లానని.. బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు, అసత్య ప్రచారం ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడిగినానని.. అలా నిలదీసినందుకు క్యూ న్యూస్ సిబ్బంది తనను నిర్భందించి, కర్రలతో కొట్టారని, విచక్షణారహితంగా తిట్టారని చెప్పాడు.
అంతేకాకుండా తన మెడలోని చైన్, జేబులో ఉన్న నగదు, చేతికున్న ఉంగరాన్ని బలవంతంగా లాక్కున్నారని అన్నారు. అప్పుడే పోలీసులు రావడంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని.. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించినట్లు’ కంప్లైంట్ లో తెలిపాడు సాయి కరణ్. ఈ ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా తీన్మార్ మల్లన్న భార్య మమతను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మల్లన్న రిమాండ్ అనంతరం విడిచి పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలని నిలదీసేందుకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు మమత రాగా.. మల్లన్నతో మాట్లాడిస్తామని చెప్పి పోలీసులు ఆమెను అక్కడినుండి తీసుకెళ్లారు.