టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే.. విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు టీఎస్పీఎస్సీని తప్పుబడుతున్నారు. తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసు దర్యాప్తును సిట్ కు బదిలీ చేశారు సీపీ. దీంతో ఇకపై ఈ కేసు విచారణ సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో జరగనుంది. ఇక, ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. వారికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా… వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
నిందితులను కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఈ వ్యవహారంలో నిందితుల రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. అందులో కీలక విషయాలను పొందుపరిచారు. ఏఈ, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షా పత్రాలను ప్రవీణ్ తన వద్దే ఉంచుకున్నట్లు తెలిపారు.
24 పేజీల ఏఈ పరీక్ష పేపర్ పత్రాలు, 25 పేజీల టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షా పత్రాలు అతడి నుంచి స్వాధీనం చేసుకున్నామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ఏ3 రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.