ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో నిన్న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇక్కడి ఓ అపార్ట్మెంట్ లో సంభవించిన ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు,10 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారని చీఫ్ సెక్రెటరీ సుఖ్ దేవ్ సింగ్ తెలిపారు. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు.
జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేబట్టారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని తాను ఆదేశించినట్టు సీఎం హేమంత్ సొరేన్ వెల్లడించారు. వ్యక్తిగతంగా సహాయ చర్యలను తాను పర్యవేక్షిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ అగ్నిప్రమాదానికి కారణం తెలియలేదు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడినవారికి 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రధాని మోడీ ప్రకటించారు.
జొరాఫాటక్ లో 13 అంతస్తులున్న ఈ బిల్డింగ్ లో హఠాత్తుగా మంటలు రేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాదాపు 40 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించాయి. 10 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. ఈ బిల్డింగ్ లోని ఓ ఫ్లాట్ లో పూజ జరుగుతుండగా మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. అయితే పోలీసులు దీన్ని ధ్రువీకరించలేదు.