బంగ్లాదేశ్ లోని అనేక గ్రామాల్లో 14 హిందూ దేవాలయాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం రాత్రి, నిన్న తెల్లవారుజాము మధ్య కాలంలో ఈ ఘటనలు జరిగాయని పోలీసులు తెలిపారు. కొన్ని దేవతా విగ్రహాలను, ఆలయ సంబంధ వస్తువులను ఆలయాల వద్ద ఉన్న చెరువుల్లో కనుగొన్నామని హిందూ నేత బైద్యనాథ్ బర్మన్ చెప్పారు. విగ్రహాల్లో కొన్ని ధ్వంసమై ఉన్నాయని, ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పూజా సెలబ్రేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కూడా అయిన ఆయన డిమాండ్ చేశారు.
నిజానికి ఈ గ్రామాల్లో హిందూ.. ముస్లిముల మధ్య సామరస్య వాతావరణం ఉందని, ఇది కావాలనే ఎవరో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన యత్నంలా కనిపిస్తోందని ఆయన చెప్పారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. మాతో ముస్లిములకు ఏ విధమైన గొడవలు గానీ, తగాదాలు గానీ లేవు.. బహుశా బయటి ప్రాంతాలవారి పనే ఇదై ఉండవచ్చు అని బర్మన్ అన్నారు.
ఒక పథకం ప్రకారం జరిగిన దాడులుగా వీటిని భావిస్తున్నామని, శాంతియుత వాతావరణాన్ని భంగపరచేందుకు ఆలయాల విధ్వంసానికి పూనుకొన్నారని ఠాకూర్ గావ్ గ్రామ పోలీసు అధికారి జహంగీర్ హుసేన్ చెప్పారు.
ఈ ఉదంతంపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని, ఇందుకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ఆలయాలపై జరిగిన దాడుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులు హిందూ ఆలయాలను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్ లో తాజాగా జరిగిన ఈ సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.