ముంబైలోని చెంబూరు భరత్ నగర్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. భారీ వర్షాలకు ఇళ్లపై కొండ చరియలు విరిగిపడి ఇప్పటిదాకా 14 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. ప్రమాద స్థలంలో NDRF సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ముంబై నగరంలో పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇవాళ ఉదయం భరత్ నగర్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో తొలుత 11 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తాజాగా ఆ సంఖ్య 14కు చేరింది. 15 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.