సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్ధలపై 14 విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కేంద్రం వీటిని నిరంకుశంగా వినియోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలను ఇష్టమొచ్చినట్టు ఈ సంస్థలు అరెస్టు చేస్తున్నాయని, అందువల్ల అరెస్టుకు ముందు. ఆ తరువాత జరుగుతున్న పరిణామాలపై గైడ్ లైన్స్ జారీ చేయాలని ఇవి అభ్యర్థించాయి. పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో దీనిపై విపక్షాలు మండిపడుతూ అత్యున్నత న్యాయస్థానానికెక్కాయి.
కాంగ్రెస్ తో బాటు తృణమూల్ కాంగ్రెస్, ఆప్, బీఆర్ఎస్, ఝార్ఖండ్ లిబరేషన్ ఫ్రంట్, జేడీ-యు, సమాజ్ వాదీ పార్టీ, శివసేన (ఉధ్ధవ్), నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, తదితర పార్టీలు వీటిలో ఉన్నాయి. ఆయా కేసుల్లో ఆప్ కి చెందిన మనీష్ సిసోడియాను, బీఆర్ఎస్ కు చెందిన కవితను, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ఈ దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. లిక్కర్ కేసులో సిసోడియాను సిబిఐ, ఈడీ ఇదివరకే అరెస్ట్ చేశాయి.
విపక్షాల పిటిషన్ పై ఏప్రిల్ 5 న విచారణ జరగాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ల్యాండ్స్ ఫర్ జాబ్స్ కేసులో తేజస్వి యాదవ్ ను, ఆయన కుటుంబ సభ్యులను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్న విషయం గమనార్హం. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కానీ ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తును నీరు గార్చాలన్నది తమ అభిమతం కాదని, అయితే 95 కేసులు విపక్షాలపైనేనని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్వి అన్నారు.
అందువల్లే అరెస్టుకు ముందు.. ఆ తరువాత జరుగుతున్న పరిణామాలపై గైడ్ లైన్స్ ను తాము కోరుతున్నామన్నారు. దర్యాప్తు సంస్థలకు ఇలాంటి మార్గదర్శకాలు ఎంతైనా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాల పిటిషన్ పై ఏప్రిల్ 5 న విచారిస్తామని సీజేఐ జస్టిస్ డీవై. చంద్రచూడ్ ఆధ్వర్యాన గల బెంచ్ ధృవీకరించింది.