పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో జనవరిలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యాలు తలెత్తాయి. ఈ క్రమంలో పంజాబ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే పంజాబ్ పర్యటనలో మోడీ భద్రత ఏర్పాట్లలో పాల్గొన్న పోలీసు సిబ్బందికి అవార్డులను డీజీపీ అందజేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి లోపాలూ లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసినందుకు వారిని డీజీపీ అభినందించారు.
మొత్తం 14 మంది పోలీసు సిబ్బందికి అవార్డులను అందజేస్తున్నట్టు ఓ ప్రకటనలో డీజీపీ వీకే బారువా తెలిపారు. ఈ అవార్డులు పొందిన వారిలో హోషియార్ పూర్ ఎస్ఎస్ పీ ధృమన్ హర్ష ద్రాయ్ నింబాలే, కపుర్తలా ఎస్ఎస్ పీ దయామా హరీశ్, రాజ్ పాల్ సింగ్ సంధూ మొదలైన వారు ఉన్నారు.
పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఓ బహిరంగ సభకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ జనవరి 5న వెళ్లారు. ఆ సమయంలో రోడ్డు మార్గంలో వెళుతుండగా ఫిరోజ్ పూర్ కు కొద్ది దూరంలో ఓ వంతెనను నిరసనకారులు బ్లాక్ చేశారు.
దీంతో ఆ ఫ్లై ఓవర్ పై ప్రధాని మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం లేచింది. ఘటనకు బాధ్యుడిగా డీజీపీని కేంద్రం బదిలీ చేయగా, ఫిరోజ్ పూర్ ఎస్పీని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.