ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్ధులు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా 10 నుండి 18 ఏళ్ల వయస్సు పిల్లల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర ముంబయిలో ఓ 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అయితే.. గేమింగ్ వ్యసనం కారణంగానే సూసైడ్ చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ ముంబయిలోని భోయ్వాడా ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో తల్లి, సోదరి లేని సమయంలో బాలుడు సూసైడ్ చేసుకున్నట్టు తెలిపారు. దానికి ముందు అతడు తన తండ్రికి కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఆయన డ్రైవింగ్ లో ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేకపోయానని చెప్తున్నాడు.
తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలుడు.. తన గది లోపలి నుంచి లాక్ చేసి ఉంది. కంగారుపడ్డ తల్లిదండ్రుల తలుపులను తలుపులు పగలగొట్టి చూడగా, ఆ బాలుడు ఉరి వేసుకుని ఉన్నాడు. దాంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
బాలుడు చదువులో, క్రికెట్ లో బాగా రాణించేవాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే.. గేమింగ్ కు అలవాటు పడటమే ఆత్మహత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.