తమిళనాడు జల్లికట్టులో విషాదం చోటు చేసుకుంది. పొంగల్ సందర్బంగా నిర్వహించిన జల్లికట్టులో ఎద్దు పొడవడంతో బాలుడు మరణించాడు. ఇప్పటి వరకు జల్లికట్టు మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ధర్మపురిలో నిర్వహిచిన జల్లికట్టును చూసేందుకు తన బంధువులతో కలిసి బాలుడు(14) వచ్చాడు. జల్లికట్టు చూస్తుండగా ఎద్దు వచ్చి పొడవడంతో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్టు వైద్యులు తెలిపారు.
బాలుని దగ్గరకు ఎద్దు ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీని కోసం సీసీ టీవీ పుటేజిని పోలీసులు పరిశీలించారు. జల్లి కట్టులో ఇప్పటివరకు అరవింద్ రాజ్, శివకుమార్, కలైముట్టి గణేశన్ సహా ఇద్దరు ప్రేక్షకులు మృతి చెందారు.
జల్లికట్టును పొంగల్ సందర్బంగా నిర్వహిస్తారు. ఈ ఆటలో భాగంగా ఒక ఎద్దును జనంలోకి వదలుతారు. ప్రేక్షకులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. జల్లికట్టు పోటీలో పాల్గొనేందుకు 300 ఎడ్లకు, 150 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
కానీ జల్లికట్టు కోసం ధర్మపురిలో సుమారు 10 వేల ఎడ్లు, 5,400 బుల్ టామర్లు రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోటీలో పాల్గొనేందుకు 800 ఎద్దులకు మాత్రమే అనుమతి లభించినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు.