కవిత ఈడీ విచారణకు వెళ్తుండడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ను విధించనట్లు పోస్టర్లు ఏర్పాటు చేశారు అధికారులు . మీడియాకు తప్ప మరొకరికి నో పర్మీషన్ అంటూ బ్యానర్లో పేర్కొన్నారు.
ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితులుంటే చర్యలు తప్పవని బ్యానర్లో హెచ్చరించారు. ఈడీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 10 గంటల తరువాత ఈడీ విచారణకు కవిత రానున్నారు. పిళ్లైతో కలిపి కవితను విచారించనున్నట్లు తెలుస్తోంది. కవితను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ఇప్పటికే మంత్రులు, పార్టీ నేతలు హస్తినాకు చేరుకున్నారు.
కవితను అరెస్టు చేస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలని బీఆర్ ఎస్ వర్గాలు సమాలోచనాలు చేస్తున్నాయి. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు ఢిల్లీలోనే ఉన్నారు. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సంయమనం పాటించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులంతా కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు.