మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర ఉలిక్కిపడింది. కొత్తగా నమోదైన కేసుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమై.. ముంబైలో శనివారం నుంచి రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, మోర్చాలు వంటి కార్యక్రమాలను అనుమతించేది లేదని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శుక్రవారం నమోదైన 7 కేసుల్లో ముంబై నుంచి మూడు, పింప్రీ-చించ్వాడ నుంచి నాలుగు ఉన్నాయి. అయితే, బాధితుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటంతో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. డిశంబర్ 1 నుంచి మొత్తం 61 వేల మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. అయితే, వారిలో 10 వేల మంది ఒమిక్రాన్ ప్రభావిత దేశాలను నుంచి వచ్చారని.. వారందరిని ట్రేస్ చేసి పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
కాగా దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 32 చేరింది. ఇప్పటివరకూ భారత్ లో 5 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర- 17 రాజస్థాన్- 9 గుజరాత్- 3 కర్ణాటక- 2 ఢిల్లీలో ఒక కేసు నమోదైంది.