రేవంత్ రెడ్డి యాత్రతో మొదలైన ఇరు పార్టీల వర్గపోరుతో భూపాలపల్లి జిల్లా సెంటర్ భగ్గు మంటోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోవడంతో ముందస్తు జాగ్రత్తలకు దిగారు పోలీసులు. ఈరోజు ఉదయం నుండి వారం రోజుల పాటు జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ విధించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా బల ప్రదర్శనకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి హెచ్చరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులు,గుంపులుగా ఎవరూ గుమిగుడవద్దని, జన జీవనానికి ఇబ్బంది కలిగించ వద్దని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాజకీయ పార్టీల నాయకుల సవాళ్లకు, బహిరంగ చర్చలకు పోలీసు శాఖ అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ముందస్తుగా 144 సెక్షన్ విధించడం జరిగింది కాబట్టి అనవసరంగా ఎవరూ బయటికి రాకూడని పేర్కొన్నారు.
మరో వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. హన్మకొండలోని నక్కలకుంటలో గండ్ర సత్యనారాయణ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. అదే విధంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని చుట్టుముట్టి పోలీసులు ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు.
ఇక ఇలా ఉంటే..భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి ఆధారాలతో సహా రెడీగా ఉన్నానని గండ్ర సత్యనారాయణ చెబుతున్నారు. అంబేద్కర్ సెంటర్ కు బయలుదేరడానికి సిద్ధమైతే.. తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని..ఎలాగైనా 11 గంటల వరకు అక్కడికి చేరుకుంటానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ ను కాపాడే ప్రయత్నంలో భాగంగా పెద్ద సంఖ్యలో పోలీసులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మోహరించారు.