కరోనా వైరస్‌ను వ్యాపించకుండా ఉండేందుకు ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యాసంస్థలు, థియేటర్లు, పార్క్‌లతో పాటు వినోద ప్రాంతాలను మూసివేసిన ఢిల్లీ ప్రభుత్వం… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని, అవసరమైతే తప్పా ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాకూడదని, వినోదం-కాలక్షేపం కోసం జనం బయటకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేయవద్దని ఢిల్లీ పోలీస్ కమీష్‌నర్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ర్యాలీలు, నిరసనలు, వినోద ప్రదర్శనల్లో ఐదుగురిని మించి ఎవరూ ఉండకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కమీషనర్ శ్రీవాస్తవ. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణాలో పరిశుభ్రత పాటించాలని, ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని ఆదేశించారు. ఈ నిషేధాజ్ఙలు ఈ నెల 31 వరకు వర్తిస్తాయని ప్రకటించారు.