కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. లిలాంగా నుంచి బయలు దేరిన పడవ ఒకటి లులోంగా నదిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 55 మంది సురక్షితంగా బయటపడ్డారు.
మిగిలిన 145 మంది ఆచూకీ తెలియడం లేదు. దీంతో వారు ప్రాణాలు కోల్పోయి వుంటారని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం ప్రమాదం చోటు చేసుకోగా కాంగో ప్రభుత్వం దాని గురించి శుక్రవారం ప్రకటన చేసింది. ఈక్వెటియర్ ప్రావిన్స్‌లోని బసన్‌కుసు నగరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
సామర్థ్యానికి మించి ప్రయాణికులను పడవలో ఎక్కించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈక్వెటియర్ ప్రావిన్స్‌లో రవాణా సదుపాయాలు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణాలకు పడవలను ఆశ్రయిస్తున్నారు.
ధనాపేక్షతో పడవ యజమానులు సామర్థ్యానికి మించి ప్రయాణికులను పడవలో ఎక్కించుకుంటున్నారు. అందుకే అక్కడ తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత అక్టోబర్‌లోనూ అక్కడ బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 40 మంది ప్రయాణికులు మరణించారు.