ఏపీలో కరోనా సుడిగాలి వేగంతో విస్తరిస్తోంది. కొన్ని రోజుల నుంచి 14 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 14,502 మంది కరోనా బారినపడ్డారు. అటు.. మరో ఏడుగురిని కరోనా కాటేసింది. దీంతో ఈ వైరస్ తో మృతి చెందిన వారి సంఖ్య 14,549కి చేరింది.
ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు చనిపోగా.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజాగా 4,800 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 20,87,282కి చేరింది. ఇంకా.. 93,305 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో విశాఖలో అత్యధికంగా 1728 బయటపడ్డాయి. తర్వాత అనంతపురం జిల్లాలో 1610మందికి ఈ మహమ్మారి సోకింది.
నిన్నటి కంటే ఎక్కువగా కేసుల సంఖ్య నమోదుకావడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 40వేల 266 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,21,87,297 కోవిడ్ టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారీగా కేసులు నమోదవడంతో అధికారులు ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. మాస్కులు వాడకం, భౌతిక దూరం తప్పని సరి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది.
రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి,ఇండోర్ లో 100 మందికి మాత్రమే అనుమతి కల్పించింది. అయితే అంతరాష్ట్ర రవాణాకు మాత్రం అవకాశం కల్పించింది. సినిమా థియేటర్ల లో సీటు సీటుకు మధ్య గ్యాప్ కూడా ఉండాలని పేర్కొంది.