– 2019-20తో పోలిస్తే 2021 ఏప్రిల్ – 2022 లో 148శాతం పెరుగుదల
– రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడి
ఫాస్టాగ్ ల ద్వారా వచ్చే ఆదాయం ఇటీవల భారీగా పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. కొవిడ్ కు ముందు సంవత్సరం 2019-20తో పోలిస్తే 2021 ఏప్రిల్ – 2022 జనవరి మధ్య ఫాస్టాగ్ ల ద్వారా ఆదాయం ఏకంగా 148శాతం పెరిగినట్టు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2021 ఏప్రిల్ – 2022 జనవరి మధ్య జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ఏఐ)కు రూ.26622.93కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. 2016లో ఫాస్టాగ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధిక ఆదాయమని చెప్పింది.
‘ 2022-23లోనూ ఫాస్టాగ్ ల ద్వారా ఆదాయం భారీగానే ఉంటుందని అంచనా వేస్తు్న్నాము. దాదాపు రూ. 35,000 కోట్లకు పైగా వసూలు అవుతాయని అనుకుంటున్నాము. 2019-20లో ఎన్ హెచ్ ఏఐకు ఫాస్టాగ్ ల ద్వారా రూ. 10,728.52 కోట్లు రాగా, 2020-21లో అది రూ. 20837.08 కోట్లకు చేరుకుంది” అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.
జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సెక్రటరీ గిరిధర్ అర్మానీ మాట్లాడుతూ.. జనవరి 31 నాటికి 45 మిలియన్ల ఫాస్టాగ్ లు జారీ చేసినట్టు తెలిపారు. రాబోయే ఏడాదిలో పలు జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. దీంతో 2025 నాటికి రూ. 50,000లకోట్ల టోల్ రుసుములను వసూలు అవుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.