కర్ణాటకలో దారుణం జరిగింది. 16 మంది దళితులను ఒకే గదిలో బంధించి వారిని టార్చర్ పెట్టిన ఉదంతం షాక్ కి గురి చేస్తోంది. చిక్కమగళూరు జిల్లాలో బీజేపీ మద్దతుదారుడైన జగదీశ గౌడ అనే కసాయి వీరిని తన కాఫీ తోటల్లోని ఓ గదిలోరోజుల తరబడి నిర్బంధించాడట. ఇతని దాడిలో ఓ మహిళ తన బిడ్డను కోల్పోయింది. ఇతని రాక్షసత్వం వెలుగులోకి రావడంత్తో.. పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో తన కొడుకు తిలక్ గౌడతో సహా పారిపోయాడు. ఈ ఇద్దరికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే జగదీశ గౌడకు తమకు ఏ సంబంధమూ లేదని, అతడు తమ పార్టీ కార్యకర్త గానీ.. సభ్యుడు గానీ కాదని వరసిద్ధి వేణుగోపాల్ అనే బీజేపీ నేత అంటున్నారు.
జగదీశ గౌడకు చెందిన కాఫీ తోటల్లో ఈ దళితులంతా రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారట. గౌడ నుంచి వీళ్ళు సుమారు 9 లక్షల అప్పు తీసుకున్నారని, కానీ ఆ రుణం చెల్లించలేకపోవడంతో వారిని ఓ గదిలో కుక్కాడని తెలుస్తోంది. తమ బంధువులు కనిపించడం లేదంటూ కొంతమంది ఈ నెల 8 న బలేహనూర్ పోలీసు స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారు.
కానీ అదే రోజున వారు తమ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అయితే ఆ మరుసటి రోజే ఓ మహిళ ఆసుపత్రిలో చేరడంతో చిక్కమగళూరు పోలీసు స్టేషన్ లో తాజాగా వారు ఫిర్యాదు చేశారన్నారు. ఈ కేసు అనుమానాస్పదంగా ఉందని భావించిన పోలీసులు కాఫీ తోటల్లోకి వెళ్లి చూడగా ఓ గదిలో 8 నుంచి 10 మంది నిర్బంధంలో ఉన్నట్టు కనుగొన్నారు. వెంటనే వారినందరినీ విడుదల చేశారు.
15 రోజులుగా వీరిని బలవంతంగా ఇక్కడ ‘లాకప్’ లో ఉంచినట్టు ఉంచారని, వీరిలో 4 కుటుంబాలు కూడా ఉన్నాయని, వీరంతా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వీరిని ఇష్టం వచ్చినట్టు కొట్టేవారని, దుర్భాషలాడేవారని ఓ అధికారి చెప్పారు. జగదీశ గౌడ తీవ్రంగా కొట్టడంతో గర్భిణీ అయిన ఓ మహిళ తన బిడ్డను పోగొట్టుకుందన్నారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఆయన వెల్లడించారు.