తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కల బెడదకు ఫుల్ స్టాప్ పడడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట వీధి కుక్కలు రెచ్చిపోతూ దాడులు చేస్తూనే ఉన్నాయి. కుక్కల ధాటికి నగర వాసులు జనాలు బెంబేలెత్తిపోతున్నారు.
ఇటీవల అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటన పూర్తిగా మరువక ముందే.. నగరంలోని వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఈ సారి ఏకంగా పదహారు మందిపై దాడి చేశాయి.
ఈ సంఘటన బాలానగర్ ప్రాంతంలోని వినాయక నగర్ లో జరిగింది. గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు దారిన వెళ్తున్న వారిపై ఎగబడి మరీ దాడులు చేశాయి. కుక్కల దాడిలో గాయపడిన 16 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ దాడిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ రవీందర్ రెడ్డి, జీహెచ్ఎంసీకి సమాచారం అందించారు. దీంతో కుక్కలను పట్టుకునేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చివరకు వాటిని పట్టుకొని అక్కడి నుండి తరలించారు. జరిగిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నుండి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.