పదహారేళ్ళ వయసంటే జీవితం మీద సరైన అవగాహన లేని వయసు. శ్రద్ధఉన్నవాడైతే టెన్త్ క్లాస్ అయ్యాకా నెక్స్ట్ ఏ కోర్సు తీసుకోవాలి. లేనివాడైతే థియేటర్లో ఏ సినిమా చూడాలి. ఓటీటీలో ఈ వారం ఏసినిమా రిలీజ్ అయ్యింది. లేదా ఐపీఎల్ మ్యాచ్ ఎవరెవరికీ మధ్య జరగబోతుంది లాంటి సమాచారాన్ని సేకరించి ఆ ప్రకారం ముందుకు వెళ్తుంటాడు. కానీ తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడు సన్యాసం స్వీకరించాడు. పదహారేళ్ల వయస్సులోనే భక్తి మార్గంలో పయనించేందుకు సిద్ధపడ్డాడు.
కోట్ల రూపాయల ఆస్తిని కాదని ఆధ్యాత్మిక చింతనలో బతకాలని నిశ్చయించుకున్నాడు. గుజరాత్కు చెందిన ఆర్యన్ అనే బాలుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆర్యన్ తల్లి పేరు కింజల్బెన్.తండ్రి సునీల్ భాయీ.
తండ్రి ఓ వజ్రాల వ్యాపారి. కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి. వీరంతా సూరత్లో నివాసం ఉంటున్నారు. ఆర్యన్కు ఓ తమ్ముడు, చెల్లి ఉన్నారు. గురువారం శ్రీ ప్రేమ్ భువనభాను అభ్యాస్ వాటికలోని వైరాగ్యవారిధి కులచంద్రసూరీశ్వర్ మహారాజు సన్నిధిలో..ఆర్యన్ సన్యాస దీక్ష చేపట్టాడు.
గత రెండు సంవత్సరాలుగా ఆర్యన్ గురు అభయశేఖర్ సూరీశ్వర్ మహారాజ్ వద్దే ఉన్నాడని సునీల్ బాయ్ పేర్కొన్నాడు. ఆర్యన్ సన్యాసం స్వీకరించిన అనంతరం..పట్టణంలో భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో ఏనుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్యన్కు డాన్స్, పాటలంటే చాలా ఇష్టమని తండ్రి సునీల్ బాయ్ తెలిపాడు. కరోనా సమయంలో ఆర్యన్ గురుకులంలో పెరిగాడని వెల్లడించాడు.
కొద్ది రోజుల క్రితం గుజరాత్లోని సూరత్లో తొమ్మిదేళ్ల చిన్నారి సైతం సన్యాసం స్వీకరించింది. ఆమె కూడా పూర్తి భక్తి మార్గంలో పయనించాలని నిర్ణయించుకుంది. చిన్న వయస్సులో అన్ని సుఖాలను వదులుకొనేందుకు సిద్ధమైంది.దేవాన్షి అనే చిన్నారి గత జనవరిలో జైన సన్యాసిగా మారింది.
ధనేష్, అమీ సంఘ్వి ఈ చిన్నారి తల్లిదండ్రులు. ధనేష్, అమీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. దేవాన్షి వీరికి పెద్ద కూతురు. ఈమెకు నాలుగేళ్ల చెల్లెలు ఉంది. దేవాన్షి తండ్రి కూడా వజ్రాల వ్యాపారే. గత 30 సంవత్సరాలుగా ధనేష్.. సూరత్లో వజ్రాల వ్యాపారం చేస్తున్నారు.
దేవాన్షి సన్యాసినిగా మారిన సమయంలో భారీ స్థాయిలో వేడుక నిర్వహించారు. జైన సన్యాసి ఆచార్య విజయ్ కీర్తియాష్సూరి అధ్వర్యంలో దేవాన్షి ఈ దీక్షను స్వీకరించింది.వందలాది మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.