ఈ జనరేషన్ లో కొందరు పిల్లలు ఎలా తయారయ్యారంటే.. ఫోనే సర్వస్వం అయిపోయింది. ఆన్ లైన్ గేమ్స్ మోజులో మైండ్ మొత్తం కరాబ్ చేసుకుంటున్నారు. చిన్నచిన్న గొడవలకే క్రూర చర్యలకు సైతం పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసిన ఘటన చూస్తే షాకవ్వాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే.. లక్నోలోని పీజీఐ ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో పాటు ఉంటోంది సాధన అనే మహిళ. భర్తకు ఆర్మీలో ఉద్యోగం. అయితే.. సాధన కుమారుడు(16) ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. ఎప్పుడూ ఫోన్ పట్టుకుని ఉండేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. పైగా కన్నతల్లితోనే వాగ్వాదానికి దిగేవాడు. పైగా అంతకుముందు ఓసారి డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో తల్లి, కుమారుడి మధ్య అనుబంధం సన్నగిల్లింది.
శనివారం మరోసారి గొడవ జరగగా.. తల్లిపై అప్పటికే పీకల్లోతు కోపం పెంచుకున్న బాలుడు ఆమె నిద్రిస్తున్న సమయంలో తుపాకీతో కాల్చాడు. మూడు రోజుల పాటు శవాన్ని ఇంట్లోనే దాచి ఉంచాడు. దుర్వాసన రాకుండా ఉండాలని గదుల్లో రోజూ రూమ్ ఫ్రెష్ నర్లు కొడుతూ ఉన్నాడు. అమ్మమ్మకు ఒంట్లో బాలేదు.. అమ్మ ఊరికి వెళ్లిందని చుట్టుపక్కల వారికి కట్టుకథలు అల్లాడు. రోజులు గడిచేకొద్దీ శవం కుళ్లిపోసాగింది. దీంతో తండ్రికి ఫోన్ చేశాడు. అమ్మను ఎవరో చంపేశారని ఓ స్టోరీ చెప్పాడు. దీంతో షాకైన అతను.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులకు సైతం కట్టు కథ వివరించాడు బాలుడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మూడు రోజుల నుంచి ఇంటికి వస్తున్నాడని.. అతడే హత్య చేసి ఉంటాడని చెప్పుకొచ్చాడు. శవాన్ని పరిశీలించిన పోలీసులు.. చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేయగా బాలుడు వారితో చెప్పింది తెలిసింది. ఆ కోణంలో కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. కన్నతల్లిని తానే చంపానని ఒప్పుకున్నాడు.