రంగారెడ్డి జిల్లా మండలం చెగుర్ కన్హా శాంతి వనంలో 1600 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
ఆరోగ్యానికి మెడిటేషన్ తో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. శాంతి వనంలో నిర్మించిన ఈ క్రీడా ప్రాంగణాన్ని అనురాగ్ ఠాకూర్ తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్ ప్రారంభించారు. అనంతరం కన్హా గ్రీన్ 2 కే రన్ లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఆ తర్వాత 11 దేశాలకు సంబంధించిన 22 మందికి యోగా అంబాసిడర్ లుగా సర్టిఫికేట్లు అందజేశారు. క్రీడల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మెంటల్ ఫిట్ నెస్ కోసం యోగా, ఫిజికల్ ఫిట్ నెస్ కోసం క్రీడలు రెండూ ఒకే చోట ఏర్పాటు చేయడం అద్బుతమని చెప్పారు.
కామన్వెల్త్ లో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామీణ యువత సైతం క్రీడల్లో రాణించాలని మండలానికి ఒక స్టేడియం నిర్మిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆటల కోసం ఇంత పెద్ద ప్రాంగణం నిర్మించడం సంతోషమని బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల పట్ల యువతను బాగా ప్రోత్సహిస్తున్నాయన్నారు. గత పదేళ్ళలో పిల్లల తల్లిదండ్రులు కూడా క్రీడల వైపు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన చెప్పారు.