క్రికెట్ మ్యాచ్‌లలో అప్పుడప్పుడు వింతైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్ని సార్లు జట్లు చాలా తక్కువ స్కోర్లకే ఆలౌట్ అవుతుంటాయి. అది సహజంగానే జరుగుతుంటుంది. కానీ ఆ వన్డే మ్యాచ్‌లో మాత్రం ఆ జట్టు కేవలం 17 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అవును.. మీరు విన్నది నిజమే. ఈ సంఘటన ఇండోర్‌లో జరుగుతున్న వుమెన్స్ సీనియర్ వన్ డే ట్రోఫీలో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తాజాగా ముంబై, నాగాలాండ్ సీనియర్ వుమెన్స్ జట్లకు మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. అందులో నాగాలాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టు 17.4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు ప్లేయర్లలో ఎవరూ డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. సరిబా అనే ప్లేయర్ మాత్రమే 9 పరుగులు చేసి హై స్కోరర్‌గా నిలిచింది. ముంబై బౌలర్ సత్ఘరే 8.4 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తీసింది. దీంతో నాగాలాండ్ జట్టు అత్యల్ప స్కోరు చేసింది.
తరువాత బ్యాటింగ్ చేసిన ముంబై 4 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై ఓపెనర్లు ఈషా ఓఝా, వృషాలి భగత్‌లు 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి టార్గెట్ ఛేదించారు. కాగా ఇలా ఆ జట్టు అంత అత్యల్ప స్కోరుకు ఆలౌట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.