నిధులు నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం తమ జీవితాలతో ఆటలాడుతోందని మండిపడుతున్నారు. తాజాగా రాష్ట్ర పోలీసు శాఖలో 17 వేల ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అయితే.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. అందులో భాగంగా పోలీసు శాఖలోనూ ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాగా.. అన్ని శాఖలతోపాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ శాఖలో దాదాపు 16 వేల కానిస్టేబుల్, వెయ్యి ఎస్సై పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని అధికారులు లెక్కగట్టినట్లు తెలిస్తోంది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వాస్తవానికి గతేడాదే ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపట్టాలని భావించినప్పటికీ.. కొత్త జోన్లు, జిల్లా ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక అడ్డంకుల కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం అన్ని రకాల అడ్డంకులు తొలగడంతో ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు నియామక మండలి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఈ సారి కొత్త జోన్లు, జిల్లాల వారీగా నియామకాలను చేపట్టనుంది. తప్పులు, సమస్యలకు తావులేకుండా అభ్యర్థులు ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. చివరగా ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.