గడిచిన రెండేండ్లలో జమ్ములో 176 సార్లు ఉగ్రవాదుల చొరబాటు యత్నించారని, 320 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు (లేదా) మరణించారని లోక్ సభలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పందిస్తూ… సరిహద్దుల వెంట ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు జమ్ము వద్ద ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు.
‘ 2021-2022 మధ్య జమ్ములో 176 సార్లు ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు జరిగాయి. 2020లో ఉగ్రదాడుల్లో 62 మంది భద్రతా సిబ్బంది మరణించారు. 106 మంది గాయపడ్డారు. 2021లో 42 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 117 మంది సైనికులకు తీవ్రగాయాలయ్యాయి” అని చెప్పారు.
‘ 2020లో 99 సార్లు ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో ఎదురు కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు మరణించారు. 2021లో 77 సార్లు చొరబాటుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా 12 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది” అని పేర్కొన్నారు.