జక్కన్న చెక్కిన శిల్పం-తారక్. ఇది తనే అనేక సందర్భాల్లో చెబుతుంటాడు. RRR మూవీ షూటింగ్‌లో వున్న జూనియర్ యన్టీఆర్ ఆనాటి ఓ మధుర జ్ఞాపకాన్ని, ఇప్పుడు తన ప్రెజెంట్ స్టేటస్‌ని గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేశాడు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఇదేరోజు స్టూడెంట్ నెంబర్ 1 మూవీని ఆర్ఎఫ్‌సీలోనే షూట్ చేశారట. మళ్లీ అదే ఆర్ఎఫ్‌సీలో అదే రాజమౌళితో కలిసి సినిమా చేస్తుండటం యాధృచ్ఛికం అంటూ చేసిన ఈ ట్వీట్‌లో అప్పటి ఇప్పటి ఫోటోల్ని పెట్టాడు. ‘ఈ 18 ఏళ్లలో చాలా మారిపోయాయి. కానీ, జక్కన్నతో కలిసి పనిచేయడంలో వున్న ఆ ఫన్ మారలేదు.. ’ అంటూ ట్వీట్‌లో తారక్ సంబరపడిపోయాడు. కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి సహ దర్శకత్వం చేశారు.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టునీడలో.. వీడలేమంటు.. వీడుకోలంటు వెళ్లిపోతున్నామూ.. అంటూ ఇదే మూవీలో కాలేజ్ సాంగ్‌లో ‘వియ్ మిస్ ఆల్ ద ఫన్’ అను పంక్తుల్ని గుర్తుచేస్తూ… ‘మేము మాత్రం ఆ ఫన్ మిస్సవ్వలేద’ని తారక్ తేల్చడం అందర్నీ ఆకట్టుకుంటోంది.
18ఏళ్ల ప్రయాణంపై రాజమౌళి కామెంట్:
స్టూడెంట్ నెం.1 దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటూ స్టార్ డైరెక్టర్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. స్టూడెంట్ నెం.1 సినిమాలో ఓ సందర్భంగా తీసిన ఫోటోను, ఈరోజు అదే స్టైల్‌లో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంటూ, అనుకోకుండా 18 సంవత్సరాల ప్రయాణం తర్వాత అనుకోకుండా మళ్లీ ఇదే రామోజీ ఫిల్మ్ సిటిలో కలవటం ఆనందంగా ఉంది. ఈ 18ఏళ్ల ప్రయాణంలో ఇద్దరం ఎంతో ఎదిగాం. కాకపోతే జూనియర్ ఎంతో సన్నబడగా, నేను చాస్త పెద్దవాడినైపోయాను తెల్ల గడ్డంతో అంటూ అప్పటి-ఇప్పటి ఫోటోలను ట్వీట్ చేశారు.