చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జియాంగ్జి ప్రావిన్స్‌లో పలు వాహనాలు ఢీ కొన్నాయి. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మరణించగా, 22 మందికి తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు చేశారు. పొగ మంచు నేపథ్యంలో వాహనాలను నెమ్మదిగా నడపాలని, వాహనాలను ఓవర్ టేక్ చేయడం, లైన్ మారడం లాంటివి చేయకూడని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
గతేడాది సెప్టెంబర్ లోనూ చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా రోగులను క్వారంటైన్ కు తరలిస్తున్న బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సులోని 27 మంది మరణించారు. గిజావ్ ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగింది.