కంబోడియా అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 19కు చేరుకుంది. డైండ్ సిటీ హోటల్‌లో బుధవారం(స్థానిక కాలమానం ప్రకారం) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాంటే మీంచే ప్రావిన్స్ పరిధిలోని పోయ్పెట్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హోటల్‌లోని మొదటి అంతస్తులో ప్రమాదవ శాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఆ సమయంలో హోటల్ లో ఉన్న సిబ్బంది, కస్టమర్లు భయంతో ఒక్క సారిగా పరుగులు తీశారు. కొందరు ప్రాణభయంతో హోటల్ మొదటి అంతస్తు నుంచి బయటకు దూకేశారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాద సమయంలో 400 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువగా కంబోడియా, థాయ్ లాండ్ దేశస్తులేనని తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ఈ హోటల్ థాయ్ లాండ్ సరిహద్దుకు దగ్గరంలో ఉంది. ఈ క్రమంలో మంటలను ఆర్పేందుకు థాయ్ లాండ్ సరిహద్దు నగరం నుంచి కూడా అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. ఇరు దేశాల అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.