ప్రముఖ గ్రాండ్ మాస్టర్ హన్స్ నీమాన్ 100 కంటే ఎక్కువ ఆన్ లైన్ చెస్ గేమ్స్‌లో మోసానికి పాల్పడ్డాడని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ప్రముఖ ఆన్ లైన్ చెస్ ప్లాట్ ఫారమ్ అయిన చెస్. కామ్ చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్టు జర్నల్ వెల్లడించింది.
చెస్ గేమ్‌లో నీమాన్ చీటింగ్ చేస్తున్నాడంటూ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ ఆరోపణలు చేయడంతో చెస్ ప్రపంచం మొత్తం ఒక్కసారి ఆశ్చర్యానికి గురైంది. ఈ ఆరోపణలను నీమాన్ ఖండించాడు. తన కెరీర్‌ను నాశనం చేసేందుకే కార్ల్ సన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని నీమాన్ తెలిపాడు.
కానీ తనకు 12 ఏండ్లు ఉన్నప్పుడు ఓ సారి, 16 ఏండ్లు ఉన్నప్పుడు మరోసారి మాత్రమే చీటింగ్ చేసినట్టు నీమాన్ ఒప్పుకున్నాడు. ఈ విషయంలో దర్యాప్తు చేసిన చెస్.కామ్ సుమారు 72 పేజిల నివేదికను అందజేసింది. సుమారు 100కు పైగా ఆన్ లైన్ చెస్ గేమ్స్ తో పాటు పలు ప్రైజ్ మనీ టోర్నమెంట్స్ ల్లో చీటింగ్ చేశాడని చెస్.కామ్ వెల్లడించినట్టు పేర్కొంది.
నీమాన్ తనపై వచ్చిన చీటింగ్ అభియోగాలను గతంలో ప్రైవేట్ గా ఒప్పుకున్నాడని, దాంతో నిర్ధిష్ట సమయం వరకు అతనిపై నిషేధం విధిస్తూ ఓ చెస్ వెబ్ సైట్ నిషేధం విధించినట్టు పేర్కొంది. చెస్.కామ్ హెడ్ డానీ రెన్ష్ గత నెలలో నీమాన్ ఓ లేఖ కూడా రాశారు.
చెస్‌లో నీమాన్ మూవ్ మెంట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నాడు. చెస్ గేమ్ ఆడుతున్న సమయంలో తన కంప్యూటర్‌లో వేరే స్క్రీన్‌ను ఓపెన్ చేసి ఉన్నట్టు తాము గుర్తించామని ఆయన పేర్కొన్నారు.