బెంగళూరు సమీపంలోని నందిహిల్స్ లోని బ్రహ్మగిరి కొండపై నుంచి జారి కొండ అంచుల్లో 300 అడుగుల లోతులో చిక్కుకున్న యువకుడిని భారత వాయుసేన అధికారులు రక్షించారు. యువకుడిని ఇంజినీరింగ్ విద్యార్థి నిశాంక్ శర్మగా అధికారులు గుర్తించారు.
ఘటన వివరాల్లోకి వెళితే.. నిశాంక్ తన స్నేహితులతో కలిసి బ్రహ్మగిరి కొండలపై ట్రెక్కింగ్ కు వెళ్లాడు. కొండ పైకి ఎక్కుతున్న సమయంలో కాలు కాస్త జరడంతో పట్టు కోల్పోయి కిందకు జారిపోయాడు. 300 అడుగుల లోతున కొండ అంచుల మధ్య చిక్కుకు పోయాడు.
నిశాంక్ పడిపోవడం చూసిన అతని స్నేహితులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు అధికారులకు సమాచారం అందించారు. కొండ వాలుగా ఉండటంతో అతన్ని రక్షించడం అధికారుల వల్ల కాలేదు.
దీంతో వారు ఆర్మీ సహాయాన్ని కోరారు. రంగంలో దిగిన ఆర్మీ అధికారులు ఎంఐ 17 హెలికాప్టర్ ద్వారా అతన్ని రక్షించి బయటకు తీసుకువచ్చారు. ఇంతకు ముందు కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని చేరాట్ కొండల్లోకి బాబు అనే యువకుడు ట్రెక్కింగ్ కు వెళ్లాడు.
ఆ సమయంలో కొండ మీద నుంచి జారి కొండ అంచుల్లో చిక్కుకున్నాడు. బిక్కు బిక్కు మంటు కొండ అంచుల్లోనేసుమారు 48 గంటల పాటు ఉండిపోయాడు. తర్వాత ఆర్మీ అధికారులు హెలికాప్టర్ సహాయంతో అతన్ని కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.