అది అర్ధరాత్రి సమయం. నోయిడా రోడ్లపై ఓ వ్యక్తి వేగంగా పరుగెడుతున్నాడు. దాన్ని కారులో వచ్చిన వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొద్ది సమయంలోనే దాన్ని లక్షల మంది వీక్షించారు. ఆ పరుగెత్తుతున్న యువకుడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకు ఆ వ్యక్తి ఎందుకు పరుగెత్తుతున్నాడంటే..
ఉత్తరాఖండ్ కు చెందిన ప్రదీప్ మెహ్రా నోయిడా రోడ్లపై వేగంగా పరుగెత్తుతున్నాడు. ఆ సమయంలో చిత్ర నిర్మాత వినోద్ కప్రీ అటుగా వెళుతున్నాడు. ప్రదీప్ మెహ్రాను చూసి లిఫ్ట్ ఇస్తానని వినోద్ అన్నారు.
దాన్ని ఆ యువకుడు సున్నితంగా తిరస్కరించాడు. తాను ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నానని, అందుకే షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక ఆఫీస్ నుంచి ఇంటికి రోజు 10 కిలో మీటర్లు పరుగెత్తుతున్నాను అని బదులిచ్చాడు.
మరి ఉదయం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అని యువకుడిని వినోద్ ప్రశ్నించారు. తాను ఉదయం 8 గంటలకు లేచి వంట చేయాలని, మిగతా సమయాల్లో తనకు ప్రాక్టీస్ వీలుకాదని తెలిపాడు. అందుకే తాను ఆ సమయాన్ని ఎంచుకున్నట్టు చెప్పాడు.
దీనికి మీ తల్లి దండ్రులు ఎక్కడ ఉన్నారు అని వినోద్ అడగ్గా.. తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని చెప్పాడు. ఇంతలో తాను ఇంటికి వెళ్లి వంట చేయాలన్న విషయాన్ని ప్రదీప్ చెప్పారు.
దీంతో పదాం.. మనం డిన్నర్ చేద్దాం అంటూ ప్రదీప్ కు వినోద్ ఆఫర్ చేశాడు. దానికి తన తమ్ముడు ఇంటి వద్ద ఉన్నాడని, అతనికి తానే అన్నం వండి పెట్టాలని అందుకే రాలేనని చెప్పాడు.
ఆ యువకుడితో సంభాషణ మొత్తాన్ని వినోద్ వీడియో తీసి ట్విట్ చేశారు. ఈ యువకుడు ఎంతో మందికి స్ఫూర్తి అంటూ వినోద్ క్యాప్షన్ పెట్టారు.