గూగుల్ ప్లే స్టోర్ అంటే తెలియని వారుండరు. ఎలాంటి యాప్ కావాలన్నా ఆండ్రాయిడ్ వినియోగదారులు అందరూ ప్లే స్టోర్ కు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ గూగుల్ యాప్ పై అంత నమ్మకం వినియోగదారులకు. ఈ యాప్ లో మనకు హాని కలిగించే, లేదంటే మన డేటాను లీక్ చేసే యాప్ లు దాదాపుగా ఉండవనే అంతా నమ్ముతారు. అయితే తాజాగా మాత్రం అందరికీ షాకిచ్చే ఓ విషయం బయటపడింది. అవాస్త అనే డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ ప్లే స్టోర్ లోని 19,000 కంటే ఎక్కువ యాప్‌లు సురక్షితం కాదని గుర్తించింది. ఈ యాప్‌లు యూజర్ వ్యక్తిగత డేటాను కూడా లీక్ చేస్తాయట. అంతేకాదు ఫోన్ భద్రతను ప్రమాదంలో పడేయవచ్చు.
దీని వల్ల ఫైర్‌బేస్ డేటాలో కీలకమైన కాన్ఫిగరేషన్ కారణంగా మిగతా చాలా యాప్‌లకు కూడా సెక్యూరిటీ పరంగా హాని ఉందని డిజిటల్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఫైర్‌బేస్ అనేది యూజర్ డేటాను నిల్వ చేయడానికి ఆండ్రాయిడ్ డెవలపర్లు ఉపయోగించే సాధనం. పేర్లు, చిరునామాలు, లొకేషన్ డేటా, కొన్ని సందర్భాల్లో పాస్‌వర్డ్‌లు వంటివి యాప్‌ల ద్వారా సేకరించి, ఆ సమాచారాన్ని అందులో భద్రపరుస్తారు.
Advertisements
ఆ 19,000 యాప్ లలో ఎక్కువగా లైఫ్ స్టైల్, గేమింగ్, ఫుడ్ డెలివరీ, ఇమెయిల్‌తో సంబంధం కలిగి ఉంటాయని, యూరోప్, సౌత్-ఈస్ట్ ఆసియా, లాటిన్ అమెరికా ప్రాంతంలోని యూజర్లు దీని వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న 180,300 ఫైర్‌బేస్ లలో 10 శాతానికి పైగా అవాస్ట్ థ్రెట్ ల్యాబ్స్ పరిశోధకులు ఓపెన్ చేయగలిగారు. అంటే హ్యాకర్లకు యాప్ వినియోగదారుల డేటా తెలిసిపోతుంది. అది ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందో అందరికి తెలిసిందే. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడుతుంది.