సెలబ్రిటీల పుట్టినరోజులు వచ్చాయంటే కచ్చితంగా సినిమా ప్రకటనలు ఉంటాయి. అయితే ఆ ప్రకటనలు ఏంటనేది ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోతుంటాయి. ఇక మిగిలిన ప్రాసెస్ అంతా నామమాత్రమే. హీరో ఎవరైనా ఇదే తంతు. అయితే హీరోయిన్ రష్మిక మాత్రం ఈ విషయంలో చిన్నపాటి షాకిచ్చింది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆమె ప్రకటించిన సినిమాలు రెండూ ఆడియన్స్ కు షాకిచ్చాయి.
స్వప్న సినిమాస్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు ఏడాదిగా ఈ పనులు సాగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ సడెన్ గా రష్మిక పేరు ప్రకటించి షాకిచ్చారు మేకర్స్.
ఇదే అనుకుంటే, ఇంతకంటే పెద్ద షాక్ ఇంకోటి వచ్చింది. వంశీ పైడిపల్లి, కోలీవుడ్ స్టార్ విజయ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా రష్మికనే తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా ఈరోజు అధికారికంగా ప్రకటించారు. కోలీవుడ్ విజయ్ సరసన ఛాన్స్ అంటే జాక్ పాట్ కొట్టినట్టే. అలా ఈ బర్త్ డే కు రెండు స్వీట్ సర్ ప్రైజెస్ ఇచ్చింది రష్మిక.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బడా సినిమాలే లక్ష్యంగా దూసుకుపోతోంది. మరో రెండేళ్ల పాటు మిడ్-రేంజ్ హీరోలకు ఆమె అందుబాటులోకి రాకపోవచ్చు. మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆమె వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తాజాగా రణబీర్ కపూర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.