తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. తంజావూరు జిల్లా కలిమేడులో విద్యుదాఘాతంతో 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఘటన వివరాల్లోకి వెళితే…
కలిమేడులోని ఓ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. రథోత్సవ సమయంలో భక్తులు రథాన్ని లాగుతుండగా విద్యుత్ తీగలు రథానికి తాకాయి. దీంతో భక్తులకు ఒక్క సారిగా విద్యుత్ షాక్ తగిలింది.
దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని తంజావూరు మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ మరో 8 మంది మరణించారు.
ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు.
ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తంజావూరు తనను కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.