ఝార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారుల కన్ను గుడ్లు పీకేసి.. అత్యంత క్రూరంగా హత్య చేసి ఘటన పాకుడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో స్థానికులు భయాదోళనలు వ్యక్తం చేస్తున్నారు.
పాకుడ్ జిల్లాలో అమడాపాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాడీహా గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత కుటుంబాల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకొని చూస్తే.. ఇద్దరు పిల్లలు చెరో కన్ను తొలగించి హత్య చేయబడి ఉన్నారని పోలీసులు చెప్పారు.
బాలిక వయసు 10 ఏళ్లు, బాలుడి వయసు 12 ఏళ్లు ఉంటాయని తెలిపారు. పిల్లలు ఇద్దరు బంధువుల ఇంటికి వెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తిరిగి రాలేదని.. వారిని వెతుక్కుంటూ వెళ్తే.. చివరికి శవాలుగా మిగిలారని కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోణాల్లో దర్యా్ప్తు చేస్తున్నారు.
డాగ్ స్క్వాడ్ టీమ్‌ను పిలిపించి స్థానికంగా పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. అయితే.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.