కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. దేశంలోనే కాదు ప్రపంచాన్ని కమ్మేసి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సెకెండ్ వేవ్ సమయంలో అయితే హృదయ విదారకర దృశ్యాలు ఎన్నో కనిపించాయి. అయినవాళ్లని కడసారి చూసే అవకాశం కూడా లేని దుస్థితి. ప్రభుత్వాలే అంతిమ కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే కొన్నిచోట్ల దీనిపై నిర్లక్ష్యం వహించారు. తాజాగా బెంగళూరులో వెలుగు చూసిన ఘటనే అందుకు నిదర్శనం.
బెంగళూరులో 16 నెలల తర్వాత కరోనాతో చనిపోయిన రెండు మృతదేహాలకు దహన సంస్కారాలు జరిగాయి. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణం. గతేడాది జూన్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా చికిత్స తీసుకుంటూ చనిపోయారు. వారి గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో సిబ్బంది మార్చురీకి తరలించారు. మిగిలిన శవాలను ఖననం చేసిన వారు.. ఈ రెండింటి సంగతి మర్చిపోయారు. అప్పటినుంచి అవి కోల్డ్ స్టోరేజీలోనే ఉన్నాయి.
తాజాగా కోల్డ్ స్టోరేజ్ శుభ్రం చేస్తుండగా.. కుళ్లిన దశలో రెండు డెడ్‌బాడీలు కనిపించాయి. అవి చూసి షాకైన సిబ్బంది యాజమాన్యానికి విషయం చెప్పి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.