చాలా గ్యాప్ తరువాత బాలీవుడ్ కి పఠాన్ మూవీతో భారీ హిట్ ని అందించాడు షారూక్ ఖాన్. ఎన్నో వివాదాలను దాటుకుని విడుదలైన పఠాన్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న షారూక్..ఈ సినిమాతో మళ్లీ బాలీవుడ్‌లో తన స్టమీనాను నిరూపించుకున్నాడు.
అయితే ముంబైలోని మన్నత్‌లో ఉన్న ఆయన నివాసంలోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు అక్రమంగా షారూఖ్ ఇంట్లోకి ప్రవేశించారు. అయితే వారిని గుర్తించిన భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
విచారణలో వారిద్దరు గుజరాత్‌కు చెందినవారని తేలింది. తాము పఠాన్ స్టార్ షారూక్‌ను కలవడానికి వచ్చామని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువకులిద్దరిపై వివిధ సెక్షన్లకింద కేసులు నమోదుచేశారు. అయితే యువకులు ఇంట్లోకి చొరబడినప్పుడు షారూక్ దంపతులు అక్కడ ఉన్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు వెల్లడించారు.