నోరు తెరిస్తే చాలు మోడీ సర్కార్ వైఫల్యాలపై ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడతాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడం లో కేంద్రం విఫలమైందని, ఉద్యోగ కల్పన, మత ఘర్షణలు, మూక దాడులు అంటూ పలు అంశాలను ఎత్తి చూపుతూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతాయి.
ఇక మోడీ సర్కార్ కు సమయం దగ్గర పడిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అంటూ ఆగ్రహంతో ఊగిపోతాయి. అలాంటి ప్రతిపక్షాలకు ప్రజలు షాక్ ఇచ్చారు. మోడీ ప్రభుత్వానికే తమ మద్దతు అంటూ అత్యధికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ నెల 30తో మోడీ 2.0 ప్రభుత్వం మూడేండ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. ఎనిమిదేండ్ల మోడీ పాలనపై, పనితీరు, నిరుద్యోగం, అభివృద్ధి, ఇలా పలు అంశాలపై ఓ సర్వే నిర్వహించింది.
దేశం వ్యాప్తంగా 350 జిల్లాల నుంచి సుమారు 64000 మంది పౌరుల పాల్గొన్న సర్వేలో అత్యధికులు మోడీ సర్కారుకే జై కొట్టారు. గత మూడేండ్లలో ప్రభుత్వ పనితీరు తమ అంచనాలకు అనుగుణంగానే ఉందని 34 శాతం మంది అభిప్రాయపడగా, 33 శాతం మంది పాలన తమ అంచనాలకు మించి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈజ్ ఆఫ్ బిజినెస్ విషయంలో 52 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 32 శాతం అసంతృప్తిగా ఉన్నారు. ఈ మూడేండ్లలో అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట పెరిగిందా అన్న ప్రశ్నకు అవును అని 79, కాదని 15 శాతం మంది సమాధానం ఇచ్చారు.
60 శాతం మంది ప్రజలు అధికారుల నుంచి పన్ను వేధింపులు తగ్గాయని, మత సామరస్యం పెరిగిందని చెప్పారు. పార్లమెంట్ ను సక్రమంగా నడిపించడంలో, ముఖ్యమైన బిల్లులను ఆమోదించడంలో మోడీ సర్కార్ పనితీరు భేష్ అని 67 మంది వెల్లడించారు.
అయితే నిత్యావసరాల ధరల పెరుగుదల విషయంలో 73 శాతం మంది మోడీ సర్కారుపై పెదవి విరిచారు. కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో మోడీ సర్కార్ కు తక్కువ మార్కులను కేటాయించారు.